- వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ట్యాంక్‌ను శుభ్రం చేస్తుండగా విషాదం
- బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్న తమిళనాడు సర్కారు
హోసూర్: తమిళనాడులోని హోసూర్ టాటా ఎలక్ట్రానిక్స్ యాపిల్ ఐఫోన్ విడిభాగాల తయారీ యూనిట్లో విషాదం చోటుచేసుకుంది. వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ట్యాంక్‌లో పేరుకుపోయిన బురదను తొలగించే క్రమంలో విషవాయువులు పీల్చడంతో ఊపిరాడక ముగ్గురు కాంట్రాక్ట్ కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన సోమవారం సాయంత్రం జరగ్గా మంగళవారం పోలీసులు పూర్తి వివరాలు వెల్లడించారు.
మృతులను హోసూర్‌కు చెందిన కావేరి (30), ధర్మపురి జిల్లాకు చెందిన బి. అక్మల్ (28), ఎం. సారథి కుమార్ (28)గా గుర్తించారు. వీరంతా ప్లాంట్‌లోని నాల్కో వాటర్ సంస్థకు చెందిన సబ్ కాంట్రాక్టర్ వద్ద పనిచేస్తున్నారు. ట్యాంక్‌ను పరిశీలించేందుకు అక్మల్ ముందుగా అందులోకి తొంగిచూశాడు. అక్కడ ఉన్న ప్రమాదకర వాయువుల పీల్చడంతో క్షణాల్లో స్పృహతప్పి ట్యాంక్‌లో పడిపోయాడు.
అతడి పరిస్థితిని చూడాలని కావేరి చెప్పడంతో సారథి కుమార్ ట్యాంక్‌లోకి దిగాడు. అతడూ కూడా స్పృహతప్పి పడిపోవడంతో, ఇద్దరినీ రక్షించేందుకు కావేరి కూడా లోపలికి వెళ్లాడు. విషవాయువు తీవ్రతకు కావేరి కూడా ఊపిరాడక పడిపోయాడు. ఇది గమనించిన తోటి ఉద్యోగి వెంటనే భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేశారు. సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది వెంటనే స్పాట్‌కు చేరుకున్నారు. ముగ్గురిని బయటకు తీసి హోసూర్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, వారు అప్పటికే మృతి చెందినట్టు డాక్టర్లు ధ్రువీకరించారు. అనంతరం మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం కృష్ణగిరి గవర్నమెంట్ ఆస్పత్రికి తరలించారు.
భద్రతా నిబంధనల ఉల్లంఘనలపై సమగ్ర విచారణ
ట్యాంక్‌లోని బురదను తొలగించే క్రమంలో ఊపిరాడకపోవడంతోనే ముగ్గురు మృతి చెందారని కృష్ణగిరి కలెక్టర్ సి. దినేష్ తెలిపారు. భద్రతా ప్రమాణాల ఉల్లంఘనపై సమగ్ర విచారణకు ఆదేశించారు. ఈ ఘటనపై తమిళనాడు పరిశ్రమల శాఖ మంత్రి విరుదై మగల్ కీర్తన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేచారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మరోవైపు, మృతుల కుటుంబాలకు సాయం అందిస్తామని నాల్కో వాటర్ సంస్థ ప్రకటించింది.
